ఒక సినిమాను గురించి చాలారోజుల పాటు అంతా మాట్లాడుకున్నారు. ఆ సినిమా పేరే ’12th ఫెయిల్’. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విదు వినోద్ చోప్రా దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, 2023 అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇన్ని రోజులుగా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, నిన్నటి నుంచి తెలుగుతో పాటు, ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ 1997లో మొదలవుతుంది. మనోజ్ కుమార్ ( విక్రాంత్ మాసే) చంబల్ ప్రాంతానికి చెందిన యువకుడు. అక్కడి పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతం చాలా వెనకబడిపోతోంది. తల్లిదండ్రులు .. ఒక సోదరుడు .. సోదరి .. నాయనమ్మ .. ఇది అతని కుటుంబం. మనోజ్ కుమార్ తండ్రి రామ్ వీర్ (హరీశ్ ఖన్నా) చేస్తున్న చిన్నపాటి ఉద్యోగమే ఆ కుటుంబానికి ఆధారం. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఎమ్ ఎల్ ఎ .. అతని మద్దతుదారుడి అవినీతి కారణంగా, రామ్ వీర్ సస్పెండ్ అవుతాడు. దాంతో ఆ కుటుంబం గడవడం మరింత కష్టమవుతుంది.